హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కేసీఆర్ ఓడిపోతే రాజీనామా చేస్తారా అని భాజపా నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నియోజకవర్గంలోని వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో తిరిగారు. పలు పార్టీలకు చెందిన నాయకులు భాజపాలో చేరగా, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. దమ్ముంటే తనపై కేసీఆర్, హరీశ్ రావు పోటీ చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డ అని పేర్కొన్నారు. ధర్మం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే బిడ్డ అని అన్నారు.
కేసీఆర్ భరతం పట్టేది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలేనన్నారు. తాటాకు చప్పుళ్లకు ఈటల రాజేందర్ బెదరడన్నారు. తనపై ఎన్నడు కనబడని ముఖాలు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మాన్ని నమ్ముకొని ముందుకు సాగుతామన్నారు. హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది కాషాయం జెండాయేనన్నారు. కేసీఆర్ బెదిరింపులు, డబ్బు, అహంకారంతో నియోజకవర్గ ప్రజలను కిందమీద చేయటం మీ తరం కాదని ఈటన మండిపడ్డారు. గులాబీ జెండా కప్పుకుంటేనే పింఛన్, రేషన్ కార్డులు, దళిత బంధు పథకం వస్తుందని నీచపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలన్ని కేసీఆర్ తన భూములు అమ్మి ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మనం చెల్లించే పన్నుల నుంచే ఇస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రేషన్‌కార్డులు, పింఛన్లు ఉన్నాయన్న ఈటల.. ఇప్పుడు కూడా ఉంటాయన్నారు.
దమ్ముంటే నువ్వే రా కేసీఆర్, దమ్ముంటే నువ్వే రా హరీశ్ వచ్చి నిలబడు. రేపు గనుక నువ్వు ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ నువ్వు ఓడిపోతే రాజీనామా చేయమని సవాల్ విసిరినా. ధర్మం కోసం న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేయగల సత్తా ఉన్న బిడ్డను కాబట్టి తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి ఉండదు. నీ భరతం పట్టేది హుజూరాబాద్ నియోజకవర్గమేనని త్వరలోనే తెలుస్తది. ఈ హుజూరాబాద్ గడ్డమీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. -ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత
ఇదీ చదవండి: CM KCR: మూడు రోజులు దిల్లీలోనే కేసీఆర్.. నేడే పయనం.. అందుకేనా?