etela rajender on kcr: రాబోయే రోజుల్లో హుజురాబాద్ ప్రజల స్ఫూర్తిని కరీంనగర్ జిల్లా మొత్తానికి వ్యాపింపజేస్తానని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఒక్క హుజూరాబాద్ (huzurabad)లో న్యాయం జరిగితే సరిపోదని... రాష్ట్రమంతా న్యాయం, ప్రజాస్వామ్యం గెలవాలని పిలుపునిచ్చారు. ఏడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదని.. ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేసిందని ఈటల అన్నారు.
కేసీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా.. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదని ఈటల హెచ్చరించారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పి, భాజపా సర్కారు, ప్రధాని మోదీ హుందాగా నడుచుకున్నారని అన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మానేసి... రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతుల కంటనీరు తెప్పించడం మంచిదికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతులు సుఖంగా లేరు. నేను మరోసారి డిమాండ్ చేస్తున్నాను.. నీవు రాజకీయాలు చేసుకో.. కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడడు. రైతు చట్టాలను చేసిన కేంద్ర ప్రభుత్వమే వాటిని వాపసు తీసుకుంది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ప్రభుత్వం భాజపా.. ప్రధాని మోదీ హుందాగా వ్యవహరించారు. ఇప్పటికైనా నీవు ఒక్క గింజకూడా వడ్లు కొనలేదని రైతులకు క్షమాపణ చెప్పి.. రైతులను ఆదుకుంటాను.. ప్రతి గింజను కొంటామని ముందుకు రావాలి. మీరు అనుకుంటున్నారు.. రైతులు తెలివిలేని వాళ్లు, చదువు లేని వాళ్లు, ఏమీ చేయలేరని. సమయం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. ఎక్కడా మరచిపోరు. కాబట్టి ఇప్పటికైనా రైతుల ఉసురుపోసుకోకుండా.. మిల్లర్లతో మాట్లాడి, హమాలీల సంఖ్య పెంచి.. ఈ రోడ్లమీద ధాన్యం ఏదైతే ఉందో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రైతుల ఉసురు తగులుతుంది. రైతుల పక్షాన నాలాంటి వాడు తప్పకుండా అవసరమైతే కలెక్టరేట్లు ముట్టడించి.. మీ మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని హెచ్చరిస్తున్నా.
-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: bjp corporators on attack: 'జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఎలాంటి దాడులు చేయలేదు'