రోజురోజుకూ విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా పార్కులను ఏర్పాటు చేయాలని కరీంనగర్ పాలక సంస్థ భావిస్తున్నా... ఆచరణలో ముందుకు సాగట్లేదు. స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా ఖాళీ స్థలాలను గుర్తించి పార్కులుగా మార్చే ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే ఉన్నవాటిని అభివృద్ధి చేసి మరికొన్నింటి ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు.
పార్కులు కబ్జాలు...
మొత్తం 40 పార్కులకు 2 దఫాలుగా టెండర్లను ఖరారు చేసినా... పనులు మాత్రం ప్రారంభంకాలేదు. ఉన్న పార్కుల్లోనూ కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల నిరుపయోగంగానే ఉన్నాయి. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో అనేక పార్కులు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుత్తేదారులకు గడువు...
నగరంలో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న గుత్తేదారులకు గడువు విధించినట్లు పేర్కొన్నారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరాన్ని పచ్చదనంతో నింపుతామని వెల్లడించారు. డిసెంబర్‌లోగా కొన్నింటిని వచ్చే మార్చిలోగా మిగిలిన పార్కులు పూర్తి చేసి నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని వివరించారు.
పార్కుల కోసం స్థలాలు...
ఇప్పటికే గుర్తించిన పార్కుల స్థలాలు కబ్జాలకు గురికాకుండా కంచెలు ఏర్పాటు చేయాలని స్థానికులు సూచిస్తున్నారు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో పార్కుల కోసం స్థలాలు గుర్తించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.