రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని సీఈసీని తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు కోరారని వెల్లడించింది. ఈ నెల 1న 12 రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమైన సీఈసీ.. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబరు లేదా నవంబరులో హుజూరాబాద్ ఉపఎన్నిక ఉండనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జూన్‌లో రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఇప్పటికే తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. తెరాస నుంచి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. జి.శ్రీనివాస్ యాదవ్ పేరును తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది.