అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేశానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పింఛన్లు రాకపోవడంతో వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. పింఛన్లు, రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పార్టీ మారకపోయినా బలవంతంగా వెళ్లేలా చేశారన్నారు. రాజభక్తిని చాటుకునేందుకు కొందరు హుజూరాబాద్‌పై మిడతల దండులా చేస్తున్న దాడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
పీవీ జిల్లా కోసం తాను గతంలోనే ప్రతిపాదన తెచ్చానన్నారు. ప్రలోభాలతో తాను ఏనాడు గెలవలేదన్న ఈటల... ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ వరాలు ఇచ్చే అలవాటు సీఎం కేసీఆర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. తన రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించడంతో పాటు వావిలాల, చల్లూరును మండలాలుగా ప్రకటించాలని ఈటల డిమాండ్ చేశారు. తాను పార్టీ మారలేదని.. బలవంతంగా వెళ్లిపోయేలా చేశారన్నారు.
ఇదీ చదవండి: Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 14న మంత్రివర్గ ఉపసంఘం భేటీ