కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోందని డీవైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాల్లో సిటీ స్కాన్ సహా వివిధ రక్త పరీక్షల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తిరుపతి అన్నారు. ప్రభుత్వం గత సంవత్సరం ధరల పట్టిక నిర్ణయించిందని.. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ధరల పట్టికను నిర్ణయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్ లేదని, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ లేదని చెప్పి ప్రజల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అధిక మొత్తంలో వసూళ్లను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నరేశ్ పటేల్, నాయకులు రవీందర్ నాయక్, అబ్దుల్, రాజేశ్, రాణా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హుస్సేన్‌సాగర్‌లో కరోనా .. శాస్త్రవేత్తల నిర్ధరణ.!