Delay In Karimnagar Smart city Works : కరీంనగర్ టవర్‌సర్కిల్ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది.. నిత్యం వేలసంఖ్యలో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి క్రయవిక్రయాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అందుకుగాను ఆ ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు. అమృత్‌సర్ తరహాలో దీనిని అభివృద్ధి చేసేలా చేయాలని తలపెట్టారు. దానికోసం రూ.26 కోట్లు కేటాయించడంతో ఆ పనులు 70 శాతం మేర పూర్తి చేశామని అధికారులు చెబుతుండగా, నత్తనడకన సాగుతున్న పనుల కారణంగా ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, ఫుట్‌పాత్, విద్యుత్తు దీపాలు, రాత్రిపూట ప్రత్యేకంగా లైటింగ్, టవర్ సర్కిల్ నలువైపుల రోడ్డుపై టైల్స్ పనులు అతుకులమయంగా మారింది.
Karimnagar Tower Circle : టవర్‌సర్కిల్ వ్యాపార కూడలి కాబట్టి అలాంటి చోట పనులు చకచకా పూర్తి చేయాల్సింది ఉండగా మూడేళ్ల నుంచి సాగదీస్తున్నారు. ఇప్పటికీ ఆ పనులు పూర్తి చేయకపోగా, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో కాల్వలు, టైల్స్, విద్యుత్తు పనులు వదిలేశారు. ఆ పనులపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ ఉన్నా పట్టించుకోవడం లేదు. నాణ్యత ప్రమాణాలు కూడా పరిశీలించే వారే లేకుండా పోయారని వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
'నాకు జిరాక్స్ షాపు ఉంది. ఇక్కడ స్మార్ట్‌సిటీ పనులు ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతోంది. మా షాపు ముందు డ్రైనేజీ తవ్వారు ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. ఈ విషయం గురించి అధికారులను అడిగితే ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు.' - కుమారస్వామి, వ్యాపారి
Karimnagar Smart City Works : టవర్‌సర్కిల్ చుట్టూ నిర్మించిన టైల్స్ అధ్వానంగా ఉన్నాయి. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మొక్కుబడిగా వాటిని అతికించినట్లుగా ఉంది. టైల్స్ అన్నీ సమానంగా ఉండాల్సి ఉండగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండటం, ఫినిషింగ్ ఎక్కడా కనిపించడం లేదు. నడిచే ఫుట్‌పాత్ టైల్స్, విద్యుత్తు తీగలకు పైపులైను నాసిరకంగా వేయడంతో అవి మూసుకుపోయాయి. అందులోంచి విద్యుత్తు తీగలు రాకపోవడంతో పైనుంచి వేశారు.
Delay In Smartcity Works : టవర్‌సర్కిల్ ప్రాంతంలో రాత్రి పూట ఆకర్షణీయంగా వెలుగులు వచ్చేలా ప్రత్యేకంగా వీధిలైట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు తీగలు కనిపించకుండా భూగర్భంలో వేసిన పైపులైను సన్నగా ఉండటంతో మూసుకుపోయింది. దీంతో ఆ తీగలను ప్రమాదకరంగా వేలాడదీశారు. సర్కిల్ చుట్టూ అందంగా కనించేలా రాళ్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులు దగ్గరికి వెళ్లి చూస్తే దారుణంగా కనిపిస్తున్నాయి. వాటిని సక్రమంగా అతికించకపోవడం, వెనక్కి, ముందుకు, వంకరటింకరగా ఉండటం వల్ల అవి పగిలిపోతున్నాయి.
'ఇంతకు ముందు వర్షాలు వస్తే డ్రైనేజీల్లోకి నీళ్లు పోయేవి. ఇప్పుడు రోడ్లపై నిలుస్తున్నాయి. ప్రమాదవశాత్తు షాపుల్లోకి నీరు వస్తే అవి ఎత్తి బయటికి పోయాలి. ఎత్తిపోతల పథకంలాగా చేశారు. రెండు కార్లు వస్తే కూడా రోడ్డుపై సరిగ్గా పోవడానికి రావడం లేదు. టైల్స్ వేసుకుంటూ వస్తున్నారు అవి ఊడిపోతున్నాయి. 50 ఫీట్ల రోడ్డుని 20 ఫీట్లు రోడ్డు చేశారు. ఇటీవల కురిసిన ఒక్కరోజు వర్షానికి షాపులల్లోకి నీరు వచ్చాయి.' - శ్రీనివాస్, వ్యాపారి
గడియారం చుట్టూ నాలుగు రహదారులలో సుందరంగా కనిపించేలా నల్లని టైల్స్, రాళ్లతో నిర్మించారు. రాకపోకలు సాగించే సమయంలో అవి సులభంగా పైకి లేస్తున్నాయి. ఫుట్‌పాత్ టైల్స్.. వేస్తుండగానే పగిలిపోతుండటంతో ఆ పనులు మధ్యలో వదిలేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత ఇనుప స్తంభాలు తొలగించకుండా, వేసిన విద్యుత్తు తీగలు పైపైనే ఉండటంతో దుకాణాల ముందు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారింది. చకచకా పనులు చేపట్టాల్సి ఉండగా..ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి: