హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ నేటి సాయంత్రం జరగనుంది. నామినేషన్ వేసిన 61 మందిలో 42 మంది నామపత్రాలు మాత్రం సక్రమంగా ఉండగా.. వారిలో 12మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది మిగిలారు. బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించనున్నారు. ఇప్పటికే వారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కొన్నింటిని ఎంపిక చేసుకోగా.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను బట్టి వారికి వాటిని కేటాయించనున్నారు. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
విత్‌డ్రా చేసుకున్న జమున
భాజపా అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల జమునతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన వొంటెల లింగారెడ్డి తన నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం ఆదేశం మేరకు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటి వరకు వివిధ చెక్ పోస్టులు ,వివిధ విజిలెన్స్ బృందాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న కోటి 45లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీకర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు, అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే స్టాటిక్ సర్వే లైన్స్ బృందాలను, ఫ్లయింగ్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించగా.. భారీ ఎత్తున నగదు, మద్యం పట్టుబడ్డట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నగదుతో పాటు 30 గ్రాముల బంగారం, 14 కిలోల వెండిని, 867 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: KTR: తెరాస అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్.. కేటీఆర్ ఏమన్నారంటే...