కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు కౌన్సిలర్ భర్త ఆకుల భరత్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పురపాలక ఛైర్మన్ వార్డుల్లోకి చెత్త సేకరణ కోసం వాహనాలను పంపడం లేదని ఆరోపించారు. అతనికి భాజపా కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. గతనెల 31న తేదీన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 15 కోట్ల ప్రతిపాదనల విషయంలో తాము అభ్యంతరం తెలిపామని.. దానిని దృష్టిలో పెట్టుకున్న కాలనీలకు వాహనాలు రాకుండా ఛైర్మన్ నిలిపివేశారన్నారు.
ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఛైర్మన్‌కు తలొగ్గి సమస్య పరిష్కరించలేదన్నారు. కాలనీల్లో చెత్తపేరుకుపోయి దుర్గంధం వెదజల్లితే.. పాత రిక్షాలను బాగుచేసి చెత్తను బయటకు తీసుకువెళ్లాలని ప్రయత్నించామని దానికి మున్సిపల్ సిబ్బందిని పంపించి ఛైర్మన్ బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. అందుకే చెత్తను కార్యాలయం ముందు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కాలనీలో నీటి సమస్య సృష్టిస్తున్నారని, విద్యుత్ మరమ్మతులు కూడా చేయించడం లేదని తెలిపారు.
ఇదీ చూడండి: రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మంచి భవిష్యత్: నార్మ్