100.. 91.. 93.. 97.. 116 ఇవీ జిల్లాలో వరసగా ఇటీవల నమోదవుతున్న కేసుల సంఖ్య. చూస్తుండగానే కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఊహించని విపత్తుగా చాపకింద నీరులా తీవ్రతను పెంచుకుంటోంది. అందరిలో మరింత కలవరం పెరుగుతోంది. గురువారం జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 116 కేసులు నమోదయ్యాయి. మున్ముందు ఎలాంటి తీరు కనిపించనుందోననే బెంగ అన్ని వర్గాలో ప్రజల్లో అగుపిస్తోంది.
ఐఎంఎల్ డిపోలో 25 మందికి పాజిటివ్
తాజాగా కరీంనగర్ పట్టణం సమీపంలో ఉన్న ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 25 మందికి తాజాగా వెలువరించిన ఫలితాల్లో 22 మంది పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. మొత్తంగా ఇక్కడి డిపోలో 106మంది పనిచేస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,527కి పెరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 1100వరకు ఉండటం తీవ్రత తీరుని తెలియజేస్తోంది.
వేడుకలతోనే ముప్ఫు.
చిన్నా చితక వేడుకలు కరోనాను ఆహ్వానిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ పట్టణంలో వ్యాప్తి చెందుతున్న చాలా కేసులకు సంబంధించిన వాటిలో ఎవరో ఒకరు చిన్నపాటి వేడుకలు, శుభకార్యాలకు హాజరైన వారి నుంచి సోకిందనే విషయం తమ పరిశీలనతో తేలిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ ఐఎంఎల్ డిపోలో పనిచేసే వారు కరీంనగర్ పట్టణంతోపాటు సమీప మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన వారవడంతో వారి కుటుంబీకుల్లోనూ కలవరం మొదలైంది. ఇదే కాకుండా నిత్యం ఇక్కడి నుంచి లోడింగ్, అన్‌లోడింగ్ చేసే సమయంలోనూ ఇతరులకు వైరస్ ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అంతటా పెరుగుతున్న కలవరం...
ఇక్కడ అక్కడ అని లేకుండా కరీంనగర్ పట్టణంలో కరోనా అంతటా చుట్టేస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరిలో కేసులున్నట్లు తెలియగా.. తాజాగా నగరంలోని ఒకటి రెండు బ్యాంకుల్లో కేసులు ఇటీవల బయటపడటంతో వాటిలో సేవల్ని నిలిపి వేసినట్లు తెలిసింది. ఇదే తరహాలో ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా కేసులు భయాన్ని పెంచుతున్నాయి. కొత్తగా బయటపడుతున్న కేసుల్లో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఈ వైరస్ బారిన పడిన తీరు ఆ ఇంటిల్లిపాదిని ఆందోళనను పెంచుతోంది. హుజురాబాద్, జమ్మికుంటల్లోనూ కేసుల స్థాయి అదే తరహాలో పెరుగుతున్నాయి. సగటున రోజుకు 10 చొప్పున ఆ రెండు పట్టణాల్లో కేసులు పుట్టుకొస్తుండటంతో అక్కడి ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉంటున్నారు. మరోవైపు పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ, పురపాలిక సిబ్బంది రసాయన ద్రావణాల్ని పిచికారి చేయిస్తున్నారు. తమవంతుగా యంత్రాంగం కరోనా కట్టడికి అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది.
హుజూరాబాద్‌లో 17 మందికి పాజిటివ్
హుజూరాబాద్‌లో కరోనా ఉద్థృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పల్లెల్లోకి విస్తరిస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హుజూరాబాద్‌లో మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్థానిక కాకతీయ కాలనీలో ముగ్గురికి, గాంధీనగర్‌లో ఒకరికి, వరంగల్ రోడ్‌లో మరొకరికి, పోచమ్మవాడలో ఇంకొకరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే ఇప్పలనర్సింగాపూర్‌లో ఇద్దరికి, వెంకట్రావుపల్లిలో ముగ్గురికి, రంగాపూర్‌లో ముగ్గురికి, కొత్తపల్లిలో ఒకరికి, దమ్మక్కపేటలో ఒకరికి, కందుగులలో మరొకరికి పాజిటివ్ వచ్చింది. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి కిట్‌లు అందజేశారు. కేవలం నాల్గు రోజుల్లోనే 69 పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రతి ఒక్కరిని భయం వెంటాడుతోంది. నాల్గు రోజుల్లో హుజూరాబాద్ పట్టణంలో 30 మంది కరోనా బారిన పడగా, 39 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. దీన్నిబట్టి కరోనా తీవ్రత గ్రామాల్లో ఏ స్థాయిలో విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్ఛు. నియోజక వర్గంలో వైద్య బృందాలు శుక్రవారం 1,043 గృహాలను సందర్శించి 4,071 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
జమ్మికుంటలో 15 మందికి కరోనా నిర్ధారణ
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు శుక్రవారం వావిలాల పీహెచ్‌సీ వైద్యాధికారి రఘుపతి తెలిపారు,. కొత్తపల్లిలో ముగ్గురికి, కూరగాయల మార్కెట్ ఏరియాలో నలుగురికి, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో ఒకరికి, అంబేడ్కర్ కాలనీ ఏరియాలో ఒకరికి, మోత్కుల గూడెంలో ఒకరికి, హౌజింగ్ కాలనీలో ఇద్దరికి, పాత మున్సిపల్ కార్యాలయం వెనుకవైపు ఒకరికి, దుర్గాకాలనీలో ఒకరికి, కృష్ణాకాలనీలో ఒకరికి, కరోనా నిర్ధారించారని చెప్పారు. జమ్మికుంట మండలంలోని నాగంపేటలో ఒకరికి, నగురంలో ఒకరికి కరోనా నిర్ధారించారని వావిలాల పీహెచ్‌సీ వైద్యాధికారి తెలిపారు.
ఉద్యోగికి పాజిటివ్ రావడం వల్ల బ్యాంకు మూసివేత
గంగాధర ప్రధాన కూడలిలోని ఓ బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో శుక్రవారం బ్యాంకును మూసివేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఉద్యోగి కరీంనగర్‌లో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో బ్యాంకు సిబ్బంది హోంక్వారంటైన్‌కి వెళ్లారు. శుక్రవారం 8 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.
చొప్పదండిలో రెండు కరోనా పాజిటివ్
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 26 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు వైద్యుల సలహాలు పాటించి హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల