హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ సత్తా చాటుతామంటూ.. ఎంతో ధీమాగా బరిలోకి దిగిన హస్తం పార్టీ మళ్లీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదటి నుంచి తెరాస, భాజపా పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు నుంచే చేతులెత్తేసింది. మొదటి రౌండ్ నుంచి అరకొర ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఢీ అంటే ఢీ అంటున్న రెండు ప్రధాన పార్టీలకు ఎలాంటి ప్రభావం చూపకుండా.. పట్టికలో చివరన ఉన్న స్వతంత్రులతోనే తన పోటీ సాగించింది. ఇండిపెండెంట్లకు గట్టి పోటీనిస్తూ చివరివరకు పోరాడినా.. కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిలపడింది. 22 రౌండ్లలో భాజపాకు 1,06,780, తెరాసకు 82,712 ఓట్లు దక్కగా.. కాంగ్రెస్‌కు కేవలం 3,012 ఓట్లే వచ్చాయి.
వ్యూహాత్మకంగా వ్యవహరించినా..
హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదనలు ఉన్నాయి. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నుంచి ప్రచార సరళి పరిశీలించినా.. గెలుస్తామనే అంచనాలు మాత్రం పెట్టుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిచినా.. అది ఆయన వ్యక్తిగత ప్రతిష్టగానే హస్తం పార్టీ భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, భాజపా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని తెరాస ఆరోపించింది. ఈటలను రేవంత్‌రెడ్డి కలవడమే అందుకు నిదర్శమని ఓ సందర్భంలో మంత్రి కేటీఆర్ విమర్శించారు.
కొత్త ఎత్తుగడలకు లాభమా..?
ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా.. హుజూరాబాద్‌లో గెలుపు కాంగ్రెస్ అంచనాలకు కూడా అందని విషయమనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈటల గెలిచినా భాజపా ఖాతాలోకి వెళ్లదని.. అదే తెరాస గెలిస్తే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు ప్రమాదకరమని భావించిందనే వాదనలు ఉన్నాయి. కొత్త ఎత్తుగడ ఏ మేరకు కాంగ్రెస్‌కు లాభిస్తుందనే అంశం పక్కనపెడితే.. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ ధరవాతు కోల్పోవడం.. రేవంత్ సారథ్యంలో తొలి ఓటమి నమోదు కావడం జరిగిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న పోరులో భాజపా మరోసారి ముందు వరుసలో నిలిచింది.
అంతకుముందైనా.. ఆ తర్వాతైనా..
పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరాభవం మూటగట్టుకుంది. ఇటీవల దుబ్బాక, నాగార్జునసాగర్‌లోనూ ఓటమి తప్పలేదు. జానారెడ్డి వంటి సీనియర్ నేత గెలుపుతోనైనా పుంజుకోవాలని భావించినా.. నిరాశే మిగిలింది. దుబ్బాకలో హస్తం అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 22 వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి సైతం 70 వేల 932 ఓట్లు రాబట్టినా.. 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు సహా... స్థానిక ఎన్నికలు కూడా కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. సాధారణ ఎన్నికల్లో మాత్రం ముగ్గురు ఎంపీలు గెలిచి కొంత ఊరట పొందారు.
రేవంత్ సారథ్యంలో..
ఇక పీసీసీకి ఉత్తమ్ రాజీనామా తర్వాత బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అధికారం హస్తగతమే లక్ష్యమని ప్రకటించారు. పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్న రేవంత్.. వరుస కార్యక్రమాలు చేపట్టారు. దళిత గిరిజన దండోరా సభలు, నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని నిరనస కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: