కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాల చెక్కుల పంపిణీకి లబ్ధిదారులందరితో ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
కరోనా బారిన పడే ప్రమాదం..
అనేక మంది లబ్ధిదారులు ఒకే చోటికి చేరటంతో వారు కరోనా బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్న ఎమ్మెల్యేపై అంటువ్యాధులు, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇకనైనా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. సంక్షేమ పథకాల చెక్కులను సంబంధిత అధికారులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్