రెండేళ్లుగా నోరు మెదపని ఈటల రాజేందర్ ప్రతిపక్ష నాయకులపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని... కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఆయనపై వచ్చిన కబ్జా ఆరోపణలను కప్పి పుచ్చుకోవడానికే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ నుంచి డబ్బులు తీసుకున్నానడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.
కేటీఆర్‌ని కలిసినంత మాత్రాన తెరాసలోకి వెళ్తున్నాననే అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తనకే... ఈ ఉపఎన్నికలోనూ టికెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 12 ఏళ్లుగా నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నానన్నారు.
ఆయన రాజీనామా సందర్భంగా అమరవీరుల స్థూపానికి మొక్కిన ఈటల... గడిచిన ఏడేళ్లలో ఒక్క అమరవీరుని గురించి అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. దీనిపై వారి కుటుంబాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డనని చెప్పుకునే ఈటలకు మంత్రిగా ఉన్నప్పుడు బీసీలు ఎందుకు గుర్తురాలేదన్నారు.
ఇదీ చదవండి: చీఫ్ జస్టిస్‌ను కలిసిన సీఎం కేసీఆర్