వరి ధాన్యం క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించాలని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లో పర్యటించిన ఎంపీ... పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రైతులు వరి సన్న ధాన్యం పండించటం వల్ల దిగుబడి తగ్గిందని వివరించారు. రైతుల నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి రూ.1880... రెండో రకానికి రూ.1850 చెల్లిస్తుందన్నారు.
వరిలో సన్నరకం పండించడం వల్ల ప్రతి ఎకరాకు రైతులు పది బస్తాల ధాన్యాన్ని కోల్పోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ధాన్యం విక్రయించిన రైతులు మూడు నెలల పాటు డబ్బులు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండగా... నూతన చట్టంతో మూడు రోజుల్లోగా చెల్లించే సౌకర్యం కలగనుందన్నారు.