రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కాషాయం పార్టీ బలపడుతోందని తెలిపారు. సీఎం చుట్టూ ఉన్నవాళ్లు ఉద్యమకారులా.. ఉద్యమ ద్రోహులా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్‌ది కీలకపాత్ర అని ఉద్ఘాటించారు. హుజూరాబాద్ నుంచే అనేక ఉద్యమాలు.. పోరాటాలు మొదలయ్యాయని చెప్పారు.
ఈటల పరిస్థితే ఇలాఉంటే తెరాస ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని సంజయ్ నిలదీశారు. మంత్రులపై ఆరోపణలు వస్తే సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మరికొన్ని రోజుల్లో తెరాస భూకబ్జాలు బయటపెడతామని స్పష్టం చేశారు.