హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad by elections 2021) ఘన్ముక్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస శ్రేణులతో కలిసి మరోసారి ఘన్ముక్లకు కౌశిక్‌రెడ్డి రాగా... కౌశిక్‌రెడ్డిని భాజపా శ్రేణులు అడ్డగించాయి. మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానికేతరులు ఎందుకు వచ్చారని భాజపా నేతలు నిలదీశారు. కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌశిక్‌రెడ్డి దౌర్జన్యానికి యత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఘన్ముక్లలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ కౌశిక్‌రెడ్డి తన ఐడీ కార్డు చూపించారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు తనకు హక్కు ఉందని అన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తెరాస నేత కౌశిక్‌రెడ్డికి పోలీసు సిబ్బంది రక్షణగా నిలిచారు.
పోలింగ్ కేంద్రానికి పోయే అధికారం నాకు ఉంది. తెరాసకు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌ను . 305 పోలింగ్ కేంద్రాల్లో దేనికైనా వెళ్లే అధికారం నాకు ఉంది. ప్రశాంతంగా ఓట్లు వేయించే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈటల వర్గీయులు సానుభూతి కోసం యత్నిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వెళ్లేందుకు నాకు హక్కు ఉంది.
-కౌశిక్‌రెడ్డి, తెరాస నేత
కొనసాగుతున్న పోలింగ్
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్((Huzurabad by election 2021)) కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
ఓటేసిన ఈటల దంపతులు
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ దంపతులు కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్..... సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కరోనా జాగ్రత్తలతో పోలింగ్(Huzurabad by election 2021) జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగనుంది.
ఇదీ చదవండి: Huzurabad by election 2021: హుజూరాబాద్ ఉప ఎన్నికలో 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా...