Bandi Sanjay comments on kcr and jagan : ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం’ అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తే ‘జై తెలంగాణ అని నేనంటా.. జై ఆంధ్రా అని నువ్వను’ అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
తాను చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కరీంనగర్ గడ్డ..భాజపా అడ్డా’ అని అన్నారు. ఈ నేలలో పౌరుషం ఉందని, ధర్మం కోసం పని చేయడమే తప్ప.. విజయం కోసం అడ్డదారులు తొక్కనని చెప్పారు. అవమానాలకు భయపడే వ్యక్తిని కాదని, కార్యకర్తలు, ప్రజల కష్టార్జితం వల్లే ఎంపీగా గెలిచానన్నారు.
‘‘ నాకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. నా గెలుపుతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకానికి కరీంనగర్ కార్యకర్తలే కారణం. ప్రజలే అభిమానంతో గెలిపించారని మోదీ, అమిత్‌షా గుర్తించారు. కాషాయ జెండాతో రాష్ట్రాన్ని పవిత్రం చేయాలని భాజపా అధిష్ఠానం చెప్పింది’’ - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీళ్లు, నిధులు,నియామకాలకు సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని బండి సంజయ్ తెలిపారు. కానీ, రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏమాత్రం సహకరించడం లేదన్నారు.
ఇవీ చూడండి: