కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ఓ భార్యభర్తలిద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అయితే అదే ఇంట్లో ఉంటున్న తల్లిని పరీక్షల నిమిత్తం శంకరపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు ఆ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. సదరు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా వృద్ధురాలిని 108 వాహనంలో ఎక్కించి కరీంనగర్‌కు పంపించారు.

వంకాయగూడెం గ్రామ సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లాలని 108 సిబ్బందికి చెప్పగా, వాహనాన్ని నిలిపివేశారు. ఇదే అదునుగా భావించిన వృద్ధురాలు నడుచుకుంటూ తిరిగి శంకరపట్నం మండల కేంద్రానికి తిరిగి వచ్చింది. బస్టాండ్ ఆవరణలో ఉన్నట్లుగా గుర్తించారు 108 సిబ్బంది. వాహనంలో ఎక్కాలని సూచించగా ససేమిరా అంటూ రోడ్డ పక్కన కూర్చుండిపోయింది.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవి, రెవెన్యూ అధికారులు ప్రయాణ ప్రాంగణం వద్దకు చేరుకొని వృద్ధురాలితో మాట్లాడారు. అయినప్పటికీ కరీంనగర్‌కు వెళ్లనని మొండిపట్టు పట్టింది. ఎట్టకేలకు సిబ్బంది ఆ వృద్ధురాలిని వాహనంలోకి ఎక్కించి కరీంనగర్‌కు తరలించటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.