అధికారుల అలసత్వంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఓ సామాజిక కార్యకర్త కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. నెత్తిన పది రూపాయలతో అతికించిన టోపీని ధరించి వినూత్న నిరసన చేపట్టాడు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన దుర్గ మనోహర్ అనే సామాజిక కార్యకర్త.. రేకుర్తిలోని 55వ సర్వే నంబర్, 19వ డివిజన్ పరిధిలో గల 137 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించాడు.
బెదిరిస్తున్నారు..
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా.. పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, మంత్రి అనుచరులు.. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. సొంత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించాడు. దీనిపై ప్రశ్నిస్తున్నందుకు తనపై ఎంతో మంది బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రజా సంక్షేమం కోసం మాత్రమే తాను ఈ పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల.. అక్రమార్కులు కోట్ల రూపాయలు దన్నుకొంటున్నారని ఆరోపించాడు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని మనోహర్ కోరుతున్నాడు.
ఇదీ చూడండి:'చెయ్యి పట్టుకుని.. జిప్ విప్పితే లైంగిక దాడి కాదు'