కరీంనగర్ జిల్లాలోని వలస కార్మికులను ఒడిశాకు తరలించేందుకు 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ తెలిపారు. ముంబయి నుంచి వలస కార్మికులతో కరీంనగర్ చేరుకున్న శ్రామిక్ రైలు వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముంబయి నుంచి 1720 మంది వలస కూలీలతో బయలుదేరిన ప్రత్యేక రైలులో కరీంనగర్‌కు 382 మంది కూలీలు వస్తున్నారన్న సమాచారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ నుంచి వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణం, పెద్దపల్లి, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు చేరవేసేందుకు పది ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ... కేవలం 44 మంది మాత్రమే కరీంనగర్ చేరుకున్నారు. అందరికీ వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చారు.
అందరూ 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండేలా స్టాంపింగ్ చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. అందరు బస్సులోకి ఎక్కిన తర్వాత వారికేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పేర్లను నమోదు చేసుకున్న 2100 మంది కార్మికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయనున్నట్లు శ్యాంప్రసాద్‌లాల్ వివరించారు.