మనసుంటే మార్గం ఉంటుందని... ఆ యువకులు నిరూపించారు. ఉపాధి కోల్పోయామని ఆందోళన చెందకుండా ఆత్మస్తైర్యంతో ముందుకుసాగారు. తాము మెచ్చిన రంగంతోపాటు అవకాశం ఉన్న ఇతర రంగంలో ఉపాధిని వెతుక్కొని కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అన్ని సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని సూచిస్తున్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు.
కొత్త ఆలోచనతో..
కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మల్లేశ్... ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేసేవాడు. కరోనాతో కళాశాల మూతపడంది. అందరిలానే గందరగోళానికి గురయ్యాడు. ఉపాధి కోల్పోయి ఇంటివద్దే ఉండిపోయాడు. ఖాళీగా ఉన్నందున... తల్లిదండ్రులు చేస్తున్న చిరువ్యాపారంతో తనలో కొత్త ఆలోచన వచ్చింది. రాజంపేటలోని బస్టాండ్ వద్ద... మల్లేశ్ తల్లిదండ్రులు ఒక్క రూపాయికే ఒక మిర్చి విక్రయిస్తూ ప్రాచుర్యం పొందారు. ఈ కోవలోనే మల్లేశ్ తోపుడుబండిని కొనుగోలు చేసి వివిధ రకాల చిప్స్, మిక్సర్, లడ్డూ, బూందీ, చెకోడీలు వంటి తినుబండారాలు అమ్ముతున్నాడు. ఇంట్లోనే వాటిని తయారుచేసి ఉదయం నుంచి రాత్రి వరకు విక్రయిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా ఇదే పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
రైతన్నగా..
అదే జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లికి చెందిన నరేశ్‌రెడ్డిది కూడా ఇలాంటి కథే. ఎంకాం పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో... కామర్స్ అధ్యాపకుడిగా పనిచేసేవాడు. కరోనాతో కళాశాల మూతపడటం వల్ల తండ్రి బాటలో వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. తండ్రితో కలిసి తనకున్న ఎనిమిది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి సహా కూరగాయలు సాగు చేస్తున్నాడు. పండించిన కూరగాయలను సొంతంగా మార్కెటింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
కరోనాతో ఉద్యోగాలు పోయాయని, వ్యాపారాల్లో నష్టం వచ్చందని కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితేనే జీవితం నిలుస్తుంది. ఇప్పటికైనా యువత ఈ దిశగా ఆలోచించి బలవన్మరణాలకు దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం