ఆదివారం రాత్రి అద్భుతమైన సినిమా రిలీజ్ అయిందని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం(TJS president professor kodandaram) తనదైన శైలిలో స్పందించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలపూర్ గ్రామంలో ధాన్యం కుప్పపై మృతి చెందిన రైతు బీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగంపేటలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలో ఉన్నారని కోదండరాం(TJS president professor kodandaram) అన్నారు. వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని తెలిపారు. వరి వేస్తే ఉరి అని చెబుతూ ప్రభుత్వం కర్షకులను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి తప్ప ప్రత్యామ్నాయ పంటలు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. ఒకవేళ వేసినా మార్కెట్ ఉంటుందన్న నమ్మకం లేదని చెప్పారు. మొక్కజొన్న వేస్తే కొనేది లేదని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని, కందులపై రైతులు ఆసక్తిగా లేరని, పత్తి వేస్తే కాటన్ పరిశ్రమలు కొనడం లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారని, ఇతర పంటలు వేస్తే కోతులు, పంటల బెడద ఉందని కోదండరాం(TJS president professor kodandaram) వివరించారు.
"లింగంపేట మండలంలో మామిడి చిన్న బీరయ్య వరిధాన్యం కుప్పపై చలికి తట్టుకోలేక, కొనుగోలు కేంద్రంలో వసతులు లేక మృతి చెందాడు. రైతులకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ కష్టాలు బీరయ్యకు ఉన్నాయి. విదేశాలు వెళ్లగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుని రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడు. అందులో ఒక ప్లాట్ అప్పు కోసం అమ్మేశాడు. మరొకటి అమ్మి ఎకరం భూమి కొన్నాడు. ప్రస్తుతం ఆ భూమి కూడా బీరయ్య పేరు మీద లేకపోవడం వల్ల రైతు బీమాకు కూడా బీరయ్య నోచుకోలేకపోయాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతు మృతి చెందితే పట్టించుకునే నాథుడే లేడు."
- కోదండరాం, తెజస అధ్యక్షుడు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటు రైతులతో ఫుట్‌బాల్ ఆడుతున్నారని కోదండరాం(TJS president professor kodandaram) మండిపడ్డారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల పరం చేయాలని కేంద్రం అనుకోవడం వాస్తవమేనన్న కోదండరాం.. దానికోసం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఓటేసి గెలిపించిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆరే సమాధానం చెప్పాలన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారన్న కోదండరాం.. ఆదివారం రాత్రి అద్భుతమైన సినిమా రిలీజ్ అయిందని, అది రోజూ సీరియల్ మాదిరిగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. రైతు సమస్యను పక్కదారి పట్టించడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తాను కొంతమంది రైతులతో మాట్లాడితే కేసీఆర్‌ను దించేద్దాం అని మాట్లాడుతున్నారని తెలిపారు. చేజేతులా గోతులు తవ్వుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి కోదండరాం(TJS president professor kodandaram) అన్నారు.
"రైతు సమస్యలపై కచ్చితంగా తెలంగాణ జనసమితి రంగంలోకి దిగుతుంది. లింగంపేట నుంచే దానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగాలు రాక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటికి రైతు ఆత్మహత్యలు తోడైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. బతుకులను ఛిద్రం చేసుకోవడానికే తెలంగాణ సాధించుకున్నామా? పోడు రైతుల సమస్యలపై జరిగే అఖిలపక్షం సమావేశానికి తమను పిలవద్దని ఆదేశాలు ఇచ్చారు. తాము ఎక్కడ పోరాటం చేపట్టినా అవాంతరాలు సృష్టిస్తున్నారు. రైతుల అప్పుల విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. రైతులకు బ్యాంకులు కేవలం 25 శాతం మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. మిగతా 75 శాతం బయట నుంచి తెచుకుంటున్నారు. చివరకు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు."
- కోదండరాం, తెజస అధ్యక్షుడు
ధరణి పేరుతో పాత పట్టా పాసు పుస్తకాలకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని కోదండరాం(TJS president professor kodandaram) అన్నారు. కేంద్రంతో వరిధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత కేసీఆర్‌పై ఉందని, దానికోసం దిల్లీ వెళ్తారో.. ఏం చేస్తారో ఆయన ఇష్టమని చెప్పారు. వరి వేయొద్దంటే మాత్రం రాష్ట్రంలో సంక్షోభం తప్పదని స్పష్టం చేశారు. రైతు బీరయ్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని కోదండరాం(TJS president professor kodandaram) డిమాండ్ చేశారు.