కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లళ్లది దయనీయ పరిస్థితి. ఈ ఇంట్లో అందరితోనూ విధి ఆటలాడుతోంది. సుంకరి అనసూయకు ఇద్దరు అక్కలు లక్ష్మీ, యశోద. తండ్రి పదేళ్ల క్రితం చనిపోయారు. తల్లితో కలిసి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కాలం వెళ్లదీసేవాళ్లు. ఇద్దరు అక్కలకు పెళ్లిల్లు జరిగాయి. దురదృష్టవశాత్తూ.. పెద్ద అక్క భర్త చెరువులో పడి, చిన్నక్క భర్త ప్రమాదం కారణంగా అనారోగ్యం పాలై తనువు చాలించారు. ఇవి చాలవన్నట్టు భర్త సాయిలు ఆమెను ఆరేళ్ల క్రితం వదిలేశాడు. ముగ్గురూ విధి చేతిలో బలై పుట్టింటికి వచ్చారు. కూలీ పనులు చేస్తూ పూట గడుపుతుండగా.. మరోసారి కాలం వెక్కిరించింది.
తల్లికి సుస్థి చేయగా సుమారు రెండు లక్షల అప్పు చేసి వైద్యం చేయించారు. ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అనసూయ అక్క లక్ష్మి కంటిచూపు కోల్పోగా.. యశోద సైతం అనారోగ్యంపాలైంది. వీళ్ల చికిత్సలతో మరో రూ.2లక్షల అప్పు మిగిలింది. మొత్తం 4 లక్షలు అప్పుతో కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లింది. ఇంట్లో చిన్నామె అనసూయ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం మస్కట్ వెళ్లి.. పని చేస్తూ డబ్బులు పంపిస్తోంది. చెల్లెలు పంపే డబ్బుతోనే ఇద్దరు అక్కలు వైద్యం చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కరోనా మహమ్మారి రూపంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. కొవిడ్ వల్ల అనసూయ మస్కట్లోనే చిక్కుకుపోయింది. చేసిన పనికి సైతం యజమాని జీతం ఇవ్వడంలేదు. ఫలితంగా ఇంటికి డబ్బులు పంపలేకపోతోంది. అటు అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. బాకీ తీర్చకపోతే ఉన్న గుడిసెనూ ఇవ్వాలని అడుగుతున్నారని ఆ కుటుంబం వాపోయింది. తమను ఆదుకోవాలని మస్కట్లో ఉన్న అనసూయ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.
చెల్లెలు పంపే డబ్బులపైనే ఆధారపడిన ఆ కుటుంబానికి పూట గడవడం కష్టంగా మారింది. వీరి ఆకలి తీర్చే బాధ్యతను అనసూయ కుమార్తె తీసుకుంది. పదో తరగతి పూర్తి చేసి.. కరోనా వల్ల ఇంటి దగ్గరే ఉంటున్న ఆమె.. వ్యవసాయ పనులకు వెళ్తోంది. వచ్చే కూలీ డబ్బులతోనే కుటుంబానికి ఒక పూట తిండి పెడుతోంది. దాతలెవరైనా పెద్దమనసుతో ఆదుకోవాలని ఈ నిరుపేద కుటుంబం వేడుకుంటోంది.