ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఒక్కరోజులోనే రూ.8 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గురువారం మరో రూ.5 కోట్ల విక్రయాలు జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉభయ జిల్లాల్లో కలిపి 128 మద్యం దుకాణాలున్నాయి. పది దుకాణాలు మినహా అన్నింటిలో అమ్మకాలు జరిగాయి.
సమయం తగ్గినా.. ధరలు పెంచినా...
- కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాల సమయాన్ని కుదించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. 16 శాతం ధరలు పెంచినా అమ్మకాలు మాత్రం రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.
- బుధవారం రూ.6 కోట్ల మేర లిక్కర్, రూ.2 కోట్ల బీర్ల అమ్మకాలు జరిగాయని అంచనా. రెండు రోజుల్లో రూ.13 కోట్ల వ్యాపారం జరగడం విశేషం.
- నిజామాబాద్ నగరంలో మామూలు రోజుల్లో రూ.కోటి మేర అమ్మకాలు జరిగేవి. తాజాగా రూ.3 కోట్లకు పైగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భారీగానే నిల్వలు...
ఉభయ జిల్లాలకు కలిపి మాక్లూర్‌లో ఐఎంఎల్ డిపో ఉంది. ఇక్కడి నుంచి దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ రూ.300 కోట్ల విలువ చేసే మద్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 90 వేల కేసుల లిక్కర్, 1.90 లక్షల కేసుల బీర్లు ఉన్నట్లు సమాచారం.
గురువారం పలు దుకాణాల్లో మద్యం నిల్వలు లేక మధ్యాహ్నానికే మూసివేశారు. కొన్నింట్లో పరిమిత కంపెనీల మద్యం మాత్రమే ఉంది. త్వరలోనే అన్ని దుకాణాలకు పూర్తిస్థాయిలో నిల్వలు చేరుతాయని అధికారులు తెలిపారు.