రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అకాల వర్షాల ప్రభావం అన్నదాతను ఇంకా వీడటం లేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన నీల సంతోశ్... నాలుగు ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశాడు. కొద్ది రోజుల కింద కురిసిన అకాల వర్షాలతో వరి పొలం మొత్తం నడుంలోతులో నీట మునిగింది. కామారెడ్డి బైపాస్ రోడ్డు పక్కన ఈ పొలం ఉండటం వల్ల పొలంలో నీళ్లు తగ్గలేదు. పంట నీట మునగగా ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది.
కనీసం తిండి గింజలైనా వస్తాయని ఆశించిన రైతు... నీళ్లలోనే పంటను కూలీల సాయంతో కోస్తున్నాడు. కోసిన పంటను ఒడ్డుకి తీసుకురావడం కష్టంగా మారగా బెల్లం వండే కడాయిని తెప్పగా మార్చి కోసిన ధాన్యాన్ని అందులో వేసి ఒడ్డుకు చేర్చి ధాన్యాన్ని ఆరబోస్తున్నాడు. నాలుగు ఎకరాల పంట సాగు కోసం రూ. లక్ష 70 వేల ఖర్చు వచ్చిందని.. పంట మునిగి పోవడం వల్ల పెట్టుబడి నీళ్లపాలైందన్నారు.
ఇదీచదవండి: గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తాం: బండి