తెలంగాణ మలిదశ ఉద్యమంలో రైలుకు ఎదురెళ్లి అసువులు బాసిన పొట్టిగారి రమేష్ గంగపుత్ర 9వ వర్ధంతిని కామారెడ్డి జిల్లా రామారెడ్డి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన తమ కుమారుడు రమేశ్ ప్రాణ త్యాగం చేశాడని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ అమరుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్ర విగ్రహం ఏర్పాటు చేయాలని రామారెడ్డి గంగపుత్ర సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆగస్ట్ 17న రమేశ్ ఆత్మ బలిదానం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. ఫలితంగా తెలంగాణ ఉద్యమాన్ని మరింత రగిలించాడని సంఘం కీర్తించింది.
తెలంగాణ కోసమే అమరుడయ్యాడు...
ప్రత్యేక రాష్ట్రం కోసమే 2011లో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రామారెడ్డి గ్రామ వాసి పొట్టి గారి రమేశ్ గంగపుత్ర అమరుడయ్యాడని సంఘం కొనియాడింది. విద్యాభ్యాసంలో చురుకుగా ఉండే రమేశ్ ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకుంటూ ప్రాణత్యాగం చేసిన పొట్టిగారి రమేష్ గంగపుత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంఘం తెలిపింది. రమేశ్‌కు బాధాతప్త హృదయాలతో ఘన నివాళి అర్పిస్తున్నామని గంగపుత్ర సంఘం స్పష్టం చేసింది.
![తెలంగాణ అమరుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్రకు ఘన నివాళి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8456780_750_8456780_1597705822992.png)
ఇవీ చూడండి : ఎడతెరిపి లేని వర్షాలకు నేలరాలుతున్న ఇళ్లు.. ఆగమేఘాల మీద నోటీసులు