కామారెడ్డి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రూ. 5 వందల విద్యుత్ బిల్లు వచ్చే ఇంటికి ఏకంగా 7 లక్షల 29 వేల 471 రూపాయల బిల్లు వచ్చింది. దాంతో ఆ ఇంటి యజమాని ఒక్కసారి అవాక్కయ్యాడు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన గాండ్ల శ్రీనివాస్ వృత్తిరీత్యా రైతు. అతని ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు రూ. 5 వందల బిల్లు వచ్చేది. ఫిబ్రవరిరో కూడా రూ. 415 మాత్రమే చెల్లించాడు.
మార్చి, ఏప్రిల్, మే నెలలో కరోనా వల్ల విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీసుకోలేదు, బిల్లు ఇవ్వలేదు. మూడు నెలలది కలిపి ఈ నెలలో ఇచ్చారు. బిల్లు చూసి సొమ్మసిల్లినంత పనైంది ఆ ఇంటి యజమానికి. వెయ్యా, రెండు వేలా..? ఏకంగా 7 లక్షల 29 వేల 471 రూపాయలు. తాము బిల్లు ఎలా చెల్లించాలో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తున్నాడు. న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు.
ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థులను అప్గ్రేడ్ చేస్తూ జీవో