కామారెడ్డి జిల్లాలో కరోనా... మళ్లీ కలవరం రేపుతోంది. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న పాజిటివ్ కేసులు... మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో స్థానికంగా నివాసముండే ఓ 60 సంవత్సరాల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. బాధితుడికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఇబ్బంది పెడుతుండటంతో... పరీక్షలు చేయించుకోవడం కోసం హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. అయితే బాధితునికి ఆ విషయం చెప్పే లోపు అతను ఆస్పత్రిలో కనిపించకుండా పోయాడు. దీంతో వారు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. కాసేపటి తర్వాత బాధితుడు మళ్ళీ ఆస్పత్రికి వచ్చాడు.
బుధవారం రాత్రి మీడియా బులెటీన్ విడుదల చేసిన తర్వాత ఇతడి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గురువారం జిల్లా వైద్యాధికారులు స్థానిక కాలనీలో... బాధితుని ప్రైమరీ కాంటాక్టులపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులైన 13 మందిని... హోం క్వారంటైన్లో ఉంచారు. అయితే హైదరాబాద్‌కు వెళ్ళక ముందు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కూడా అతను వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. బాధితుడు ఎంతమందిని కలిసాడు, ఎక్కడెక్కడ పరీక్షలు చేయించుకున్నాడనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి : నా భర్తను స్వదేశానికి రప్పించడి సారూ!