Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, కమిషనర్ పాల్గొన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. ప్రజాభిప్రాయం మేరకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని అరవింద్‌కుమార్ చెప్పారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. రైతుల భూమి సేకరించే ఉద్దేశం లేదని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.
మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేస్తూ కౌన్సిలర్ల తీర్మానం: కామారెడ్డి మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేస్తూ కౌన్సిలర్లు తీర్మానాన్ని ఆమోదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ప్రత్యేకంగా సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ ముసాయిదా తాము రూపొందించింది కాదని కామారెెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జాహ్నవి పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తీర్మానం పంపుతామని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ కౌన్సిలర్లు ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి ఛైర్‌పర్సన్ జాహ్నవి, కమిషనర్ దేవేందర్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్, దిల్లీ కన్సల్టెన్సీ పంపిన మాస్టర్‌ప్లాన్ వేర్వేరని... మున్సిపల్ ఛైర్‌పర్సన్ జాహ్నవి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌పై 60రోజుల్లో 2,396అభ్యంతరాలు వచ్చాయన్న ఆమె... రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోమని వెల్లడించారు.
అసలేం జరిగిదంటే: కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై గత కొన్ని రోజులుగా రగడ మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌ను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు.
పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన అన్నదాతలు ఆందోళనబాట పట్టారు.
ఇవీ చదవండి: జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తూ తీర్మానం
ఎయిర్ ఇండియాకు DGCA షాక్.. రూ.30 లక్షలు ఫైన్, పైలట్ లైసెన్స్ సస్పెండ్