కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. అన్ని మండలాల్లోనూ వేతన దారులు పని బాట పట్టారు. ఎండా కొండా కాదని... కష్టించి పనిచేసినా... డబ్బులు చేతికొచ్చేసరికి తీవ్ర జాప్యం తప్పడం లేదని పలువురు వేతనదారులు వాపోతున్నారు.
అన్నింటా జాప్యం
గ్రామాల్లో ఉపాధి వేతనదారుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. గతంలో పనులకు గైర్హాజరు అయిన వారి కార్డులను తొలగించారు. వాటి పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఉపాధి కార్డులు లేక పనికి వెళ్లలేకపోతున్నామంటున్నారు పలువురు. మస్టర్కు సంబంధించి సమస్యల వల్ల పని చేసినప్పటికీ వేతనాలు రావడం లేదని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధారి మండలంలోనే సుమారు రెండు వేల వరకు ఉపాధి కార్డులు పునురద్ధరణ కావాల్సి ఉండగా... మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదివేల వరకు జాబు కార్డులు పునరుద్ధరణ చేయాల్సి ఉందంటే ఎంతమంది పనిలేక ఖాళీగా ఉన్నారో తెలుసుకోవచ్చు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చేసిన వారు పనులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ పనులు కల్పించి కష్టకాలంలో కాస్తంత ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండిః డ్రైవర్ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..