సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆసుపత్రి భవనానికి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతమున్న ఆసుపత్రిలో ప్రతి నెల సుమారు 200 నుంచి 220 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. కొత్త భవనం ప్రారంభమైతే మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటు దవాఖానాలో 10 శాతం కూడా సాధారణ ప్రసవాలు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో 60 నుంచి 70 శాతం సాధారణ కాన్పులే జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో వసతులు సమకూరితే ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు.
డివిజన్ కేంద్రంలో...
బాన్సువాడ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో నిర్మాణమవుతున్న ఆసుపత్రి భవనం ప్రారంభమైతే డివిజన్ పేదలతో పాటు మెదక్ జిల్లా వాసులు కూడా లబ్ధి పొందుతారు. ప్రస్తుతం ఉన్న దవాఖానాలోనే బాన్సువాడ, బీర్కూరు, నస్రుల్లాబాద్, వర్ని, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, గాంధారి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్‌గల్, నారాయణఖేడ్, కంగ్టి తదితర మండలాలకు చెందిన గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు.
వైద్యులు, సిబ్బంది పెరిగే అవకాశం
మాతా, శిశుసంరక్షణ ఆసుపత్రి పూర్తయితే గర్భిణులకు మెరుగైన సేవలు అందుతాయి. ఇక్కడ కేవలం గర్భిణులు, బాలింతలకు మాత్రమే వైద్య సేవలు అందిస్తారు. వైద్యులు, సిబ్బంది సంఖ్య కూడా పెరగనుంది. ఆధునాతన పరికరాలు వచ్చే అవకాశం ఉంటుంది. విశాలమైన గదులున్నాయి.
బాన్సువాడ డివిజన్‌లో మహిళలకు వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడానికి పట్టణంలో రూ.20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న 100 పడకల మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రి నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. మరో రెండు నెలల్లో దీనిని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలో ప్రారంభం
100 పడకల మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు చివరి దశలోకి వచ్చాయి. త్వరలో ప్రారంభం కానుంది. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారు. కొత్తగా వైద్యులు, సిబ్బంది వస్తారు. ప్రసవాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- శ్రీనివాస్‌ప్రసాద్, బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకుడు
ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం