MLC Kavitha Comments: తెలంగాణ రాష్ట్రం దేశంలో అనేక రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ప్రజలపై భారం మోపడంలో భాజపా ముందుంటుందని కవిత విమర్శించారు. కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ పార్టీ బాగు పడలేదన్నారు. కామారెడ్డిలో తెరాస జిల్లా అధ్యక్షుడు ముజిబుద్ధీన్ ప్రమాణ స్వీకార సభలో ఆమె పాల్గొన్నారు.
అభివృద్ధి పనులతోనే సమాధానం
నీళ్లు, నిధులకేడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని చెప్పారు. ప్రజల మద్దతుతో కేసీఆర్ తెలంగాణ సాధించారని... సత్యం చెప్పి ఉద్యమం చేశారని.. ఏం చేస్తారో అదే చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఏం చేస్తామో.. అదే చెప్పడం కేసీఆర్ నైజమన్నారు. భాజపా, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులతోనే చెప్పి సమాధానం ఇవ్వాలని సూచించారు.
పేద ప్రజల తరపున గొంతెత్తేది తెరాస మాత్రమే
కరోనా సమయంలోనూ తెరాస అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. మనం రైతులకు అన్నం పెడితే.. మోదీ సున్నం పెడుతున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెడతామని మోదీ అంటే.. ఒక్క భాజపా నాయకుడు స్పందించడం లేదని దుయ్యబట్టారు. దిల్లీ అయినా.. గల్లీ అయినా పేద ప్రజల తరపున గొంతెత్తేది తెరాస మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తప్పుగా మాట్లాడిన పార్టీ మనకు అవసరం లేదని.. భాజపా నేతలు తప్పుగా మాట్లాడితే గ్రామ గ్రామన అడ్డుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో, విద్యుత్ సరఫరాలో, 24 గంటల విద్యుత్ రైతులకు ఇవ్వడంలో నెంబర్ వన్. ఇవే కాకుండా గ్రామ, పట్టణాల అభివృద్ధి, ఐటీ అభివృద్ధి, నీటి సరఫరా, రైతుబీమా, రైతుబంధు, భూ రికార్డుల ప్రక్షాళన, కల్యాణలక్ష్మి ఇలా అభివృద్ధి పథకాల్లో తెలంగాణ నెంబర్ వన్.
-- కవిత, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి: CM KCR National Politics: 'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'