నాగమడుగు ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని... రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో జడ్పీ ఛైర్మన్ శోభారాజు, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రాజీనామాకు సిద్ధం...
కొండ పోచంపల్లి నుంచి హల్ది వాగు ద్వారా నిజాంసాగర్‌కు త్వరలో సాగు నీరు వస్తాయని... ఆయకట్టు కింద రెండు పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. సీఎం కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చినంత పింఛన్లు దేశంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదన్నారు. ఒకవేళ ఇచ్చినట్లయితే తన మంత్రి పదవి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
రైతులకు అండగా...
తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం, బీమా పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించిందని... జడ్పీ ఛైర్ పర్సన్ శోభారాజు తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని... జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చెప్పారు.
ఇదీ చదవండి: రీజనల్ రింగ్‌రోడ్డు కల సాకారం కాబోతుంది: కిషన్‌రెడ్డి