కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో నూతన రైతు వేదికను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... కొత్తగా నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువనాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకులని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూంలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
కొత్తరకం పంటలు వేస్తూ రైతులు అభివృద్ధి చెందాలని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వరి నాటు కాకుండా కొత్తరకం పంటలు, కూరగాయలు పండిస్తే రైతులకు దిగుబడి ఉంటుందని తెలిపారు. రైతులు లాభసాటి పంటలు పండిస్తే మంచి దిగుబడి వస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ ఇస్తుందని నాలుగు సంవత్సరాల తర్వాత మంచి దిగుబడి ఉంటుందని అన్నారు. కంపెనీ వాళ్లే మీ వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షులు, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పోలీసుల అదుపులో వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులు