ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దాతలు భాగస్వామ్యమైతే... రాష్ట్రం మరింత ప్రగతిపథంలో పయనిస్తుందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (MINISTER KTR LATEST NEWS) తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి.... 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో జడ్పీ పాఠశాల భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేటీఆర్‌తో పాటు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లు.... దాత సుభాష్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఈ భవనాలను ప్రారంభించారు.
సుభాష్‌రెడ్డికి మంత్రి అభినందనలు
6 కోట్ల రూపాయలతో ఇంత చక్కటి పాఠశాల నిర్మించిన సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పుట్టిన గడ్డ కోసం సుభాష్‌రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రులు ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలోని పాఠశాలలకే ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్య, వైద్యానికి పెద్ద పీట వేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు. వీటిని బాగు చేసుకుంటే.. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
ఇంత గొప్పగా ఉంటుందని నేను అనుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పాఠశాల అందంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మా నియోజకవర్గాల్లో చేపడుతాం. మీ సేవలకు అభినందనలు. సుభాష్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని.. అందరూ ముందుకు రావాలని సూచిస్తున్నాను. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో... సుభాష్‌రెడ్డి లాంటి వాళ్లు తోడైతే.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.
-కేటీ రామారావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి
కార్పొరేట్‌ను తలదన్నేలా నిర్మాణం
కార్పొరేట్‌ను తలదన్నేలా బీబీపేట్ జడ్పీ ఉన్నత పాఠశాల భవనం నిర్మాణం జరిగింది. రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టారు. 42 వేల చదరపు అడుగుల్లో 32 సువిశాల గదుల్లో డిజిటల్ తరగతులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు చేశారు. గ్రంథాలయం, మూత్రశాలలు, నీటి శుద్ధి కేంద్రం, భోజనశాల, ఆట వస్తువులు, ఉపాధ్యాయులకు విశ్రాంత గదులను ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు
మరోవైపు కామారెడ్డిలో కేటీఆర్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ పర్యటన దృష్ట్యా పలువురు నాయకుల ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజాసంఘాలు, భాజపా యువ మోర్చా కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: Liquor Sales: మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు.. 350కిపైగా పెరిగే అవకాశం!