కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీడీ కార్మిక సమాఖ్య పిలుపు మేరకు.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో జిల్లాలోని 10 సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను తొలగించే ప్రయత్నం చేస్తోందని నాయకులు ఆరోపించారు. అందులో భాగంగానే 12 చట్టాలను తీసుకువచ్చి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తోందని మండిపడ్డారు. కాట్ పా చట్టం ద్వారా పరిశ్రమ కుంటుపడుతోందని, ఆ చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు లబ్ధి చేకూరేలా పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ