KTR fires on Revanth Reddy : గజ్వేల్ మాదిరిగానే కామారెడ్డి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని.. మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నియోజకవర్గమైన కామారెడ్డిలో.. నెలకొన్న దశాబ్దాల నాటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల దిశానిర్దేశంలో భాగంగా.. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పార్టీ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
KTR Meeting today in Kamareddy : కొడంగల్‌లో నరేందర్రెడ్డిపై గెలవని రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై గెలుస్తారా అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిపాజిట్‌ను.. కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని దుయ్యబట్టారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల సమస్యలు పరిష్కరించిన ఘనత.. కేసీఆర్ సర్కార్‌దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు అన్నం తినాలన్నా, బాత్‌రూమ్‌కు వెళ్లాలన్నా దిల్లీ అనుమతులు తీసుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Telangana Assembly Elections 2023 : స్వరాష్ట్రం సాధించుకున్నాక వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. నేడు బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశానికి తెలంగాణ.. అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగన్న నాటి పాలకుల మాటలను తిరగరాస్తూ.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో.. కేసీఆర్ నేడు సేద్యాన్ని పండగలా మార్చారని పేర్కొన్నారు.
కేసీఆర్ కామారెడ్డి స్థానం నుంచి పోటీచేస్తున్నారని తెలిసి.. ప్రతిపక్షాల అభ్యర్థుల గుండెల్లో వణుకు మొదలైందని ధ్వజమెత్తారు. తాము కచ్చితంగా ఓడిపోతామని తెలిసి.. పోటీ నుంచి తప్పకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై పోటీ అంటే.. పోశమ్మ గుడి ముందు గొర్రె పొట్టెలును కట్టిసినట్లేనని విపక్ష అభ్యర్థులకూ అర్థమైందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు మద్ధతుగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు.
కేసీఆర్ గెలుపుతో కామారెడ్డి నియోజకవర్గం.. రాష్ట్రంలోనే నెంబర్‌వన్ నియోజకవర్గంగా మారబోతోందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో కామారెడ్డికి గోదావరి నీళ్లు రాబోతున్నాయని.. ఇక్కడి ప్రాంతమంతా సస్యశ్యామలం కాబోతుందని తెలిపారు.
"కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డిపై గెలువని రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తానని సవాల్ విసురుతున్నాడు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు ఖాయం. కామారెడ్డి స్థానం నుంచి కేసీఆర్‌పై పోటీ చేయబోయే అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. గజ్వేల్ మాదిరిగానే కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాము. కేసీఆర్ నియోజకవర్గమైన కామారెడ్డిలో.. నెలకొన్న దశాబ్దాల నాటి సమస్యలను పరిష్కరిస్తాము". - కేటీఆర్, మంత్రి
KTR Comments on Congress Today : 'ఇంటింటికి తాగునీరు.. 24 గంటల విద్యుత్ ఆపేయమంటారేమో?'