కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నపూర్లో శుక్రవారం ఉదయం గ్రామం పక్కనే ఉన్న అడవి నుంచి ఎలుగుబంటి వచ్చింది. జనాలను చూసి భయపడిన భల్లుకం ఒక ఇంట్లోని స్నానాల గదిలో ప్రవేశించింది. గ్రామస్తులు దానిని అదే గదిలో బంధించి.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 3 గంటలైనా అధికారులు రాలేదు.
కోపంతో ఊగిపోయిన ఎలుగుబంటి..
మూడు గంటలు ఒకే గదిలో ఉన్న ఎలుగుబంటి కోపంతో తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి వీరంగం సృష్టించింది. అడవి వైపుగా పరుగు తీసింది. ప్రజలు కూడా దానిని అడవిలోకి తరమడానికి వెంబడించారు. గుంపులుగా తనపైకి వస్తున్న ప్రజలపైకి దాడి చేసింది. గిద్దె బాలరాజు (38), దేమే బాలనర్సు(28) ఇద్దరిపై దాడి చేసి కాళ్ళను, చేతులను తీవ్రంగా గాయపరిచింది.
కర్రలతో కొట్టి..
దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులంతా ఒక్కసారిగా భల్లుకాన్ని కర్రలతో కొట్టి చంపేశారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇద్దరిపై ఎలుగుబంటి దాడి చేసిందని.. వారు సకాలంలో స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని ఆరోపించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి