ఒక వైపు కరోనా మహమ్మారి... మరో వైపు అకాల వర్షాలు రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే....అక్కడ జరుగుతున్న జాప్యం తీరని నష్టాన్ని మిగిలిస్తోంది. త్వరితగతిన విక్రయాలు చేపడితేనే అన్నదాతకు మేలు జరుగుతుంది. కేంద్రాల్లో వసతులు లేక ఎదురవుతున్న ఇబ్బందులపై అన్నదాతలు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరితగతిన కొంటేనే ఊరట...
- లింగంపేట, నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాలతో పాటు పలుచోట్ల కొనుగోళ్లలో జాప్యం నెలకొంది. ఆయా మండలాల్లో పలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ధాన్యాన్ని కొనే ప్రక్రియను సంబంధిత అధికారులు చేపట్టలేదు.
- లారీల కొరతతో పాటు హమాలీలు లేకపోవడం సమస్యగా మారింది.
- సేకరించిన బస్తాలను గోదాములకు తరలించడంలో జాప్యమవుతోంది.
- అకాల వర్షాలతో ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు అద్దెకు తెచ్చి కప్పాల్సి వస్తోంది. వీటి అద్దె తడిసి మోపెడవుతోంది.
ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే...
- జిల్లాను ఐదు డివిజన్లుగా అధికారులు విభజించారు.
- ఒక్కో డివిజన్ పరిధిలో కొనుగోలు కేంద్రాల నుంచి సమీప రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు లారీల కోసం ట్రాన్స్‌పోర్టర్ల నుంచి టెండర్లు పిలిచారు.
- ఒక్కో ట్రాన్స్‌పోర్టర్ తమ వద్ద వందకు పైగా లారీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నప్పటికీ 30 నుంచి 40 లారీలను ధాన్యం రవాణాకు వినియోగించడం లేదు.
- హమాలీల కొరత కారణంగా రైసుమిల్లుల్లో దించడం ఆలస్యమవుతోంది. దీంతో లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి.
- వర్షాలతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. ట్రాక్టర్లను ధాన్యం రవాణాకు వినియోగిస్తే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
15 రోజుల నుంచి పడిగాపులు...
కొనుగోలు కేంద్రంలో 15 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నాను. రేపు మాపు అంటున్నారు. కేంద్రంలో కాంటాలు వేసిన సంచులే వందల కొద్ది ఉన్నాయి. లారీలు లేక సమస్య ఎదురవుతోంది. గతంలో రోజుకు నాలుగు నుంచి ఐదు లారీలు వచ్చేవి. ప్రస్తుతం రెండు రోజులకు ఒకటి, రెండు వస్తున్నాయి. ఇలాగైతే మరో నెలరోజులు పడుతుంది.
- దేవు సేవ్యా, పోల్కంపేట తండా
ఐదు రోజుల్లో పూర్తిచేస్తాం....
ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. 80 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తయింది. రెండు రోజులుగా వర్షాలు కురవడం వల్ల రైసుమిల్లర్లు ధాన్యం దించడంలో జాప్యం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాం. రవాణా సమస్య తలెత్తకుండా చేశాం.
- యాదిరెడ్డి, అదనపు పాలనాధికారి
ధాన్యం కమీషన్ రూ.11.47 కోట్లు...
జిల్లాలో 2018-19 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం విక్రయ కమీషన్ డబ్బులు రూ. 11.47 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని సహకార, ఐకేపీ అధికారులకు జిల్లా పాలనాధికారి శరత్ చెక్కుల రూపంలో అందజేశారు. సహకార సంఘాలకు రూ.10.65 కోట్లు, ఐకేపీ సంఘాలకు రూ.82 లక్షలు వేర్వేరుగా పంపిణీ చేశారు.