కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. భూమయ్య(55) అనే రైతు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భూమయ్య... యాసంగిలో సాగు చేసిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ఉదయం వచ్చి ధాన్యాన్ని ఆరబెట్టి చెట్టు కింద సేదతీరుతుండగా... గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబంలో నలుగురు మృతి
భూమయ్య, లచ్చవ్వ దంపతులకు సాయవ్వ, రజిత, వెంకట్ ముగ్గురు సంతానం. పదేళ్ల క్రితమే కుమారుడు వెంకట్ మేకలను మేపుతుండగా... ప్రమాదవశాత్తు కాలు విరిగి మృతి చెందాడు. కుమారుడు మృతి చెందగా... పెద్ద కుమార్తె సాయవ్వను ఇల్లరికం పెట్టుకున్నారు. సాయవ్వ భర్తకే రజితను కూడా ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా... కొన్ని రోజులకే అల్లుడు ఇళ్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అదే మనస్తాపంతో అనారోగ్యం పాలైన రజిత నాలుగేళ్ల క్రితం, సాయవ్వ 6 నెలల క్రితం మృతి చెందారు. కుటుంబ భారం మోస్తున్న భూమయ్య సైతం గుండెపోటుతో మరణించగా... ముగ్గురు మనవరాళ్లు అనాథలయ్యారు.
