కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం వానాకాలం ప్రారంభమవగా పంటలు వేయడానికి ఉదయం నుంచే బారులు తీరారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నా కరోనా వస్తుందనే భయం లేకుండా యూరియా బస్తాల కోసం భౌతికదూరం మరచి క్యూలైన్లలో నిలబడ్డారు.
ప్రైవేటులో కంటే ప్రభుత్వం అందించే యూరియా సబ్సిడీలో వస్తుందనే ఆశతో గంటల తరబడి ఎదురుచూశారు. లారీ రాగానే రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. 450 బస్తాలు మాత్రమే రాగా.. దొరికిన వారు తీసుకుని మిగతా వారు నిరాశతో ఇళ్ల బాట పట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. మండలంలో ఉన్న రైతులందరికీ సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు.