Farmers Protest for Urea: కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి జాతీయ రహదారి 44పై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపులా రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటన్నర పాటు రోడ్డుపైనే ఆందోళన కొనసాగించడంతో.. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రైతులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు.
అనంతరం రైతులు జంగంపల్లి వ్యవసాయ సహకార సంఘం వద్ద ఆందోళన చేపట్టారు. నెలరోజులుగా యూరియా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి ఏఎస్పీ అన్యోన్య రైతులకు నచ్చజెప్పారు. సమస్య పరిష్కారానికి సొసైటీ సిబ్బందితో మాట్లాడారు.
కాగా సహకార సంఘం సిబ్బంది తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. పంటలకు యూరియా చల్లే సమయం దాటిపోయిందని.. అయినా ఇప్పటికీ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. సుమారుగా 500 మంది రైతులు.. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామని.. అధికారులు మాత్రం రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటు దుకాణాల్లో సమృద్ధిగా యూరియా ఉన్నా.. సొసైటీలో మాత్రం ఉండకపోవడం ఏంటని ప్రశ్నించారు. రెండు రోజుల్లో యూరియా అందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: KTR About Musi River Beautification : 'ప్రపంచం ఆశ్చర్యపోయేలా మూసీ సుందరీకరణ'