Crop Loan Fraud in Kamareddy : సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకోవాలంటే ఓ పెద్ద ప్రహసనమే అవుతుంది. ఎన్నో పత్రాలు, మరెన్నో హామీలు అడుగుతూ బ్యాంక్ అధికారులు ముప్పుతిప్పలు పెడతారు. అలాంటిది ఓ చోట మాత్రం ఏకంగా చనిపోయిన వారి పేరు మీద పంట రుణం (Bank Loan) మంజూరు చేసి ఇతర ఖాతాల్లోకి బదిలీ చేశారు. పలువురు రైతులకు తెలియకుండా వారి రుణాలను రెన్యువల్ చేసి ఆ డబ్బులను వేరే ఖాతాల్లోకి మళ్లించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని నమ్మిన రైతులు నిలువునా మునిగారు. బ్యాంకు అధికారులు సైతం రైతులు లేకున్నా డబ్బులు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Kamareddy UBI Crop Loan Fraud : కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామస్థులకు సదాశివనగర్ మండలంలోని యూనియన్ బ్యాంకు పంట రుణాలు మంజూరు చేస్తుంది. ఇప్పటికే అనేక మంది రైతులు ఈ బ్యాంకులో అప్పు తీసుకోగా దళారులు బ్యాంకర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రుణ ఖాతాలు రద్దు చేసుకున్న, లోన్ రెన్యూవల్ చేసుకోని కర్షకులను గుర్తించి అక్రమాలకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది. ఆయా రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణాలు తీసుకొని ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.
రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - యాసంగి పంట పెట్టుబడిసాయం విడుదల
Union Bank Crop Loan Fraud Kamareddy : లింగంపల్లి గ్రామానికి చెందిన కిషన్‌రావు అనే వ్యక్తి పంట రుణాలు(Crop Loan) , రెన్యూవల్, ఎక్కువ లోన్ ఇప్పిస్తానంటూ రైతులతో సంతకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత రైతుల పేరుతో రుణం మంజూరు చేయించి తన ఖాతాలో వేయించుకున్నాడు. ఇలా సొంత గ్రామంలోనే 15మంది రైతుల ఖాతాల్లోంచి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు నగదు బదిలీ చేయించుకున్నాడు. దాదాపు రూ.20లక్షల వరకు అక్రమంగా తీసుకొని గ్రామం నుంచి ఉడాయించాడు. నిందితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం బ్యాంకుకు వెళ్లిన రైతులకు రుణం తీసుకున్నట్టు తెలియటంతో లబోదిబోమంటున్నారు.
ప్రభుత్వం ఇటీవల రూ.లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఈ క్రమంలో రైతులు మాఫీ అయింది లేనిదీ తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లడంతో జరిగిన అక్రమం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీతో పాటు మళ్లీ అప్పులు తీసుకున్నారని బ్యాంకర్లు చెప్పడంతో రైతులు నివ్వెరపోయారు. రైతులు లేకుండా రుణాలు ఎలా రెన్యూవల్ చేశారని నిలదీసినప్పటికీ అధికారుల నుంచి సరైన సమాధానం రావట్లేదని ఆవేదన వ‌్యక్తం చేస్తున్నారు. నమ్మకాన్ని అవకాశంగా మార్చుకుని సొమ్ము నొక్కేసిన బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.