సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆ పార్టీ నాయకులు కామారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు.అనంతరం ఆర్డీవో రాజేంద్ర కుమార్కు వినతి పత్రం అందించారు. ప్రపంచంలో ఓ వైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఇక్కడ అధికంగా పెట్రోల్ ధరలు పెంచడం సరైంది కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వాలు ప్రజలపై మరింత భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే వీటి ప్రభావం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలు, తగ్గించాలని.. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.బాలరాజు, జిల్లా నాయకులు బండారి రాజిరెడ్డి, నరేష్ కుమార్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'వైరస్ను జయించాలంటే శారీరకంగానూ ధృడంగా ఉండాలి'