కామారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులు కోలుకొంటున్నారు. ఒక్కొక్కరు ఇంటికి వస్తున్నారు. మరో ఇద్దరు మూడు రోజుల్లో డిశ్ఛార్జి అయ్యే అవకాశం ఉందని జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ అప్రమత్తంగానే ఉంటున్నామని చెప్పారు .
* ఇప్పటి వరకు క్వారంటైన్ చేసిన ప్రాంతాలతో పాటు రద్దీ ఉండే ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నారు.
* కామారెడ్డి జిల్లా కేంద్రంలో 104, బాన్సువాడ పట్టణంలో 50 బృందాలు, సరిహద్దుల్లో 4, రద్దీ ఉండే ప్రాంతాల్లో 10 బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.
కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు...
* జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కంటైన్మెంట్ జోన్లలో మూడింట ఆంక్షలు సడలించినప్పటికీ లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
* రాజధానితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుమతులు నిరాకరిస్తున్నారు.
* జిల్లాకు ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల వచ్చే వారిని కట్టడి చేస్తున్నారు.
మరో పన్నెండు రోజులు ఆగితే...
జిల్లాలో 16 రోజుల నుంచి కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మరో పన్నెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే కరోనారహిత జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
జిల్లాలో కరోనా ఇలా...
- ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 12
- డిశ్ఛార్జి అయిన వారు 10
- చికిత్స పొందుతున్న వారు 2
లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి...
సామాజిక దూరం పాటించడంతో పాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారికి దూరంగా ఉంటూ పనులు కొనసాగించుకోవాలని జిల్యా వైద్యాధికారి చంద్రశేఖర్ సూచించారు. అనుమానిత లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి సఫలమైందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.