కామారెడ్డి జిల్లా అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పట్టణ శివారులోని టెక్రియాల్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 44వ జాతీయ రహదారిని దిగ్బంధించి బైఠాయించారు. మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1860లకు క్వింటా చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్రాప్ హాలిడే ప్రకటనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులందరూ వాట్సప్ సందేశాల ద్వారా సంఘటితమై ఆందోళనకు తరలి వచ్చారు.
ఉదయం 11.30 సమయంలో రైతులంతా టెక్రియాల్ చౌరస్తాలో బైఠాయించారు. సుమారు 2.30 వరకు 44వ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు పలు మార్లు చెప్పినా... పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి ఇంఛార్జి ఆర్డీవో వచ్చి రైతుల నుంచి మెమోరాండం స్వీకరించారు. రైతుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు శాంతించారు. పది రోజుల్లోపు సీఎం కేసీఆర్ స్పందించి మక్కలను కొనుగోలు చేయాలని.. లేదంటే ఈనెల 30న ప్రగతి భవన్ ముట్టడిస్తాంటూ రైతులు హెచ్చరించారు.
జాతీయ రహదారిపై రైతుల ఆందోళనతో చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను మళ్లించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన సమయంలోనూ రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి.
ఇదీ చూడండి: వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన