కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 33వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. తొలుత కొనమని చెప్పిన ప్రభుత్వం... రైతుల ఆందోళనతో ఈ ఒక్కసారి కొంటామని చెప్పింది. పంట కొనుగోళ్ల కోసం 38 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 67వేల మెట్రిక్ టన్నుల మక్కలు వస్తాయని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటికి 11వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అయితే కొనుగోళ్లలో ఆన్‌లైన్ జాబితా కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు సమయంలో వ్యవసాయశాఖ సిబ్బంది వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల... సాగు విస్తీర్ణం పూర్తిగా రాలేదు. అరకొరగా విస్తీర్ణం రావడంతో రైతుల నుంచి జాబితాలో ఉన్న మేరకే కొంటున్నారు. అదీ ఎకరాకు 21.57 క్వింటాళ్లే కొంటామని పరిమితి విధించారు.
పంట సాగు సమయంలో వ్యవసాయశాఖ సిబ్బందికి రైతులు వివరాలు అందించారు. కొందరివి సగం విస్తీర్ణం నమోదు కాగా.. మరికొందరి పేర్లే గల్లంతయ్యాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ జాబితా ప్రకారమే కొనుగోళ్లు చేపట్టడంతో....పేర్లు లేని రైతులు దళారులకు విక్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వానికి విక్రయిస్తే క్వింటాకు 1850 వస్తుండగా.. దళారులకు అమ్మితే 14వందలకు మించి రావడం లేదు. ఎకరా పంటకు 15వేల వరకూ నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వం పరిమితి విధించింది. ఎకరానికి 21.57క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కానీ ఎకరాకు 30నుంచి 40క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ప్రభుత్వం విధించిన పరిమితి, ఆన్‌లైన్‌లో నమోదైన పంట పోనూ.. రైతులు సగానికి పైగా పంటను దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు 20వేల మెట్రిక్ టన్నులు దళారుల పాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి ఆన్ లైన్ జాబితా ప్రకారం కాకుండా రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.