CM KCR on Kotha Prabhakar Reddy Murder Attempt : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటనపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తాము సమస్యలపై యుద్ధం చేస్తుంటే.. పని చేసే దమ్ము లేక.. ప్రతిపక్ష పార్టీల నేతలు దాడులకు తెగ బడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కత్తులతో పొడవాలంటే తమకు చేతులు లేవా.. కత్తులు దొరకవా అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలకు తిక్కరేగితే.. రాష్ట్రంలో దుమ్ము రేగుతుందన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తే.. ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి.. కేసీఆర్‌పై జరిగినట్టేనన్న ఆయన.. అభివృద్ధిపై మేముంటే ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తారా అని ప్రశ్నించారు. గన్‌మెన్ అప్రమత్తతతో ముప్పు తప్పిందని.. తెలంగాణ ప్రజలు దాడులకు పాల్పడిన వారికి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
మేము సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం. ప్రతిపక్షాలు ఇవాళ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాయి. గన్‌మెన్ వెంటనే స్పందించడంతో అపాయం తప్పింది. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేని వారే కత్తులతో దాడికి దిగారు. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి.. నా మీద జరిగినట్లుగానే భావిస్తా. పొడవాలంటే మాకు చేతులు లేవా..? కత్తులు దొరకవా..? బీఆర్ఎస్ నేతలకు తిక్కరేగితే.. రాష్ట్రంలో దుమ్ము రేగుతుంది. కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. - కేసీఆర్
CM KCR Speech at Banswada : ఈ క్రమంలోనే రాష్ట్రంలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూసినా.. తెలంగాణలో సాధ్యం కాలేదన్నారు. రాష్ట్రంలో వెయ్యి జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామని.. ముస్లింల కోసం కూడా ప్రత్యేక గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేసిన కేసీఆర్.. కరెంట్, తాగు నీరు, సాగు నీరు వంటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించామన్నారు. చిత్తశుద్ధితో పని చేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధించామని.. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. సభ అనంతరం కేసీఆర్ ప్రభాకర్‌రెడ్డిని ఫోన్లో పరామర్శించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాం. అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించాం. చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధించాం. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని గెలిపిస్తే.. మరోసారి పెద్ద హోదాలో ఉంటారు. - కేసీఆర్
ప్రభాకర్‌రెడ్డి ఎవరికీ కీడు చేసే వ్యక్తి కాదు..: కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటన విచారకరమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు దాడి జరిగిందని.. రాజు అనే వ్యక్తి ఎంపీపై దాడి చేశాడని తెలిపారు. కత్తి లోపలికి ఎక్కువగా దిగకపోవటం అదృష్టంగా భావించాలన్న ఆయన.. ఎంత మేరకు ప్రమాదం ఉందో వైద్యులు త్వరలో చెప్తారన్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్‌రెడ్డి ఎవరికీ కీడు చేసే వ్యక్తి కాదని.. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప, దాడులకు దిగటం సరికాదన్నారు. నిందితుడు రాజు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది ఇంకా తెలియదని.. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలు చెప్తారని వెల్లడించారు.