CM KCR at BRS Praja Ashirvada Sabha : ప్రజలు తమ చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)అన్నారు. ఓటు వేసేముందు అభ్యర్థులు, వారి పార్టీల చరిత్ర చూడాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గమనించాలని కోరారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంట్ లేదని ఆరోపించారు. బిహార్‌లో ఉన్న ఆర్థికవేత్తను తీసుకువచ్చి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశానని సీఎం తెలిపారు.
BRS Public Meeting in Yellareddy : 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 18వ ర్యాంకులో ఉండేదని.. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఎదిగిందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని వివరించారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో సాగునీటికి కొరత తీర్చేందుకే ఇక్కడ పోటీ చేస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డిని కూడా తన నియోజకవర్గంగా భావిస్తానన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.
కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి - రైతులు అరేబియా సముద్రంలోకి : సీఎం కేసీఆర్
BRS Election Campaign in Kamareddy : తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్(Telangana Congress) ఎన్నో మోసాలు చేసిందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎంలు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఆ పార్టీ నేతలెవరూ ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారని విమర్శించారు. రైతుబంధు వృథా కాదు అని మీరు భావిస్తే.. కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలను కోరారు. రైతుబంధు అనేది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని వివరించారు.
'ఓటు వేసేముందు అభ్యర్థులు, వారి పార్టీల చరిత్ర చూడాలి. ప్రజలు తమ చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గమనించాలి. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంట్ లేదు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కామారెడ్డి జిల్లాలో సాగునీటికి కొరత తీర్చేందుకే ఇక్కడ పోటీ చేస్తున్నా. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డిని కూడా నా నియోజకవర్గంగా భావిస్తాను. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తా. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎన్నో మోసాలు చేసింది.' -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి
CM KCR Comments on Telangana Congress : రాష్ట్రంలో నీటి తీరువా, పాత బకాయిలు రద్దు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ధ్వజమెత్తారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధు, కరెంట్ ఉండదని విమర్శించారు. కిడ్నీ రోగులకు కూడా పింఛన్లు ఇస్తున్నామన్న కేసీఆర్.. రాష్ట్రంలో 103 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో 80 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ఎల్లారెడ్డిలో రెండేళ్లలోనే ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తామని హామీనిచ్చారు. దళితబంధు గురించి గతంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు - రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా : కేసీఆర్