కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిని మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి సందర్శించారు. జిల్లాలో ఉన్న కోవిడ్ కేసుల వివరాలు, జిల్లా ఆస్పత్రిలో ఉన్న పడకలు, వైద్యుల వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. అజయ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడి కోవిడ్ కేసులపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వైద్యుల కొరతను అధికారులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలు చచ్చినా... బతికినా... తమకు సంబంధం లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్‌కు వెళ్లడంపై ఉన్న దృష్టి... కరోనాపై రివ్యూ చేయడంలో లేదని ఎద్దేవా చేశారు. కరోనాపై ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టలేదని విమర్శించారు. జిల్లా ఆస్పత్రిలో 131 మంది వైద్యులకు 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలా అయితే ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కరోనా వైద్యం కోసం 10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పిన కేసీఆర్... వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదని విమర్శించారు.